Bayer Ramanaidu Vidya Jyothi Agricultural School
భారత దేశానికి భవిత.... యువత. నవశక్తి దృష్టి సారిస్తే.. సాధ్యం కానిదంటు ఏదీ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు, పల్లె జీవనానికి వెన్నెముకైన వ్యవసాయం... ఇప్పుడు ఆ యువత కోసమే ఎదురుచూస్తోంది. శ్రమించే శక్తి... ఆధునిక పద్ధతుల మేలవింపుతో కూడిన నేటితరం... సాగు రంగంవైపు మళ్లితే... వ్యవసాయానికి పునర్వైభవం వస్తుంది. ఇదే ఆశయంతో... డాక్టర్ డి. రామానాయుడు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో... బేయర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి వ్యవసాయ పాఠశాలను స్థాపించారు. స్వల్పకాలిక కోర్సులతో ప్రారంభమైన ఈ సాగు విద్యాలయం.. నేడు పాలిటెక్నిక్ కోర్సులు అందించే స్థాయికి చేరింది. వందలాది మంది రైతు బిడ్డలని.. వ్యవసాయ నిపుణులుగా తీర్చిదిద్దింది.
వ్యవసాయ విద్యా నిలయం.. ప్రస్తుతం 6 నెలల డిప్లమా.. 2 సంవత్సరాల వ్యవసాయ పాలిటెక్నిక్, 3 సంవత్సరాల పాలిటెక్నిక్ ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సులు నిర్వహిస్తోంది. సంస్థ పరిధిలో ఉన్న 33 ఎకరాల సాగు భూమిలో వివిధ రకాల పంటలను ఇక్కడి విద్యార్థులే పండిస్తారు. తరగతి గదిలో పాఠ్యాంశాలను, పొలంలో పండించే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు.
బేయర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి వ్యవసాయ పాఠశాలలో రాగులు, అండుకొర్రలు, సజ్జ, మొక్క జొన్న, జొన్న, వివిధ రకాల కూరగాయలు, వరి మొదలగు పంటలు పండిస్తున్నారు
పాఠశాలలో 6 నెలల డిప్లమా కోర్సుకి అర్హత 10వ తరగతి. మెరిట్ ప్రకారం విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. కోర్సు కాలంలో విద్యార్థులకు విద్య, వసతి, భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. వ్యవసాయ పాలిటెక్నిక్, పాలిటెక్నిక్ ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సులకు ఎంపిక వ్యవసాయ విశ్వవిద్యాల పరిధిలో జరుగుతుంది. 2019 సెప్టెంబర్ 10న బేటర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి వ్యవసాయ పాఠశాల 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత, రైతునేస్తం సంపాదకులు, డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. స్కూల్ వైస్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు.. రైతునేస్తం వేంకటేశ్వరరావుని సన్మానించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.