ఇప్పుడున్న వ్యవసాయ విధానాల వలన దిగుబడులు తగ్గుతాయే తప్ప పెరగవని... ఎంత శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందినా భూమిని పెంచే శక్తి ఎవ్వరికీ లేదని... ప్రకృతి వ్యవసాయం పితామహుడు సుభాష్ పాలేకర్ ఉద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో రెట్టింపు దిగుబడులిచ్చే శక్తి ఒక్క ప్రకృతి వ్యవసాయానికే ఉందని స్పష్టం చేశారు. కాకినాడలో 31వ తేదీ వరకు ప్రకృతి వ్యవసాయంపై ఎనిమిది రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. 13 జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు హాజరైన ఈ సదస్సులో పాలేకర్ ప్రసంగించారు. రసాయన సాగును నియంత్రించకపోతే రైతుల ఆత్మహత్యలు, రోగాలు, వనరుల నాశనం, భూతాపం లాంటి అనర్థాలు తప్పవన్నారు. దీనికి విరుగుడు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమేనని వివరించారు.
• నాలుగు విధానాలు
గోఆధారిత వ్యవసాయంతో శూన్య పెట్టుబడితో, కాలుష్య రహిత, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చని పాలేకర్ వివరించారు. ప్రధానంగా బీజామృతం, జీవామృతం, ఆచ్ఛాదన(మల్చింగ్), వాఫ్స (నీరు పెట్టడం) విధానాలను రైతులు పాటిస్తేపెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయవచ్చని తెలిపారు.
బీజామృతం:
20 లీటర్ల నీటిలో అయిదు లీటర్ల గోమూత్రం, 5 కేజీల ఆవుపేడ, 50 గ్రాముల సున్నం కలపి రాత్రంతా నిల్వ చేసిన అనంతరం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలను మిశ్రమంలో ముంచి విత్తాలి. వీటివల్ల వేళ్లు బాగా ఎదుగుతాయి. కంకి బాగా వేస్తుంది. పొల్లు లేని ధాన్యం దిగుబడి నిస్తుంది.
జీవామృతం:
ప్రకృతి వ్యవసాయంలో కీలకమైంది జీవామృతమే. 10 కిలోల దేశీ ఆవుపేడ, 5 నుంచి 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రం, 2 కిలోల బెల్లం(నల్లబెల్లం అయితే మంచిది), 2 కిలోల ద్విదళ పప్పుల పిండి, 200 లీటర్ల నీటిలో అర కిలో పాటి మన్ను లేదా పొలంగట్టు మన్ను రోజుకు మూడుసార్లు చొప్పున కలపాలి. రెండు రోజులు నీడలో ఉంచి గుడ్డతో వడగట్టి నీటిని వేరు చేయాలి. మిగిలిన మిశ్రమంలో నీటిని కలిపితే తిరిగి జీవామృతం తయారవుతుంది. ఆ ద్రావణాన్ని చేలో నీరు పారే సమయంలో విడిచిపెట్టాలి. ఇలా నెలకు 200 లీటర్ల జీవామృతం పంటలు ముగిసేదాకా చేయాలి.
ఆచ్ఛాదనం:
ఇది భూమి తల్లికి పైట లాంటిది. పలు రకాల ఆచ్ఛాదనలు నీటి వినియోగాన్ని తగ్గించి, భూమిలోని హానికర క్రిముల నుంచి పంటను కాపాడుతుంది. భూమిని 3 రకాలుగా ఆచ్ఛాదన చేయవచ్చు. కుళ్లి నేలలో కలిసిపోయే గడ్డి వంటి ఏ పదార్థంతో అయినా పంట భూమికి ఆచ్ఛాదన చేయవచ్చు.
వాఫ్స
పొలం భూమిలో మట్టి కణాల మధ్య గాలి, నీటి ఆవిరి 50 శాతం ఉండేలా చేయడమే వాఫ్స అంటారు. పంట మొక్కలకు నీరు ప్రధానం కాదు, ఆవిరి ప్రధానం. ఈ విధానం పంటకు తగినంత నీటిని పొలానికి అందిస్తూ సూక్ష్మ వాతావరణం అందిస్తుంది. మొక్కలకు అవసరమైన ప్రాణవాయువు, నీటి ఆవిరిని సమపాళ్లలో సరఫరా చేసేందుకు దోహదపడుతుంది.
ఈ నాలుగు పద్ధతులను ఆచరించి సాగు చేస్తే పంట భూమికి సారం కలుగుతుంది. ఎటువంటి ఎరువు, రసాయన, క్రిమిసంహార ఎరువులు అవసరం లేకుండా ఆరోగ్యవంతమైన పంట సాగు చేయవచ్చని పాలేకర్ తెలిపారు.